తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : కాటేదాన్ డివిజన్ పరిధిలోని మోహన్ రెడ్డి నగర్, బాబుల్ రెడ్డి నగర్, మార్కండేయ నగర్, బృందావన్ కాలనీ, ఎల్‌బీ నగర్, ఆర్జన్ బస్తీ, ఆదర్శనగర్, బుద్వేల్ రైల్వే స్టేషన్, నేతాజీ నగర్, శ్రీరామ్ నగర్, వెంకటేశ్వర కాలనీల్లో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర అంధకారంలో అల్లలాడుతున్నారని కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలి వర్షాలకు తోడు చీకటి కారణంగా విషపురుగులు, పాములు ఇళ్లలోకి వస్తున్నాయని, నిలిచిన నీటి వల్ల దోమలు పెరిగి చిన్నారులు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే దరుహులుం మదర్సా నుండి శివరాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన మార్గంలో చీకటిని ఆసరాగా చేసుకుని ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని, దొంగతనాల భయం పెరిగిందని పేర్కొన్నారు. ఈ మార్గంలో పోలీసు పెట్రోలింగ్ కూడా లేదని విమర్శించారు. ఉన్నతాధికారులు, పోలీసు శాఖ వెంటనే స్పందించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, పెట్రోలింగ్ పెంచి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నోముల రాము యాదవ్, గుమ్మడి మైసి రెడ్డి, గంజి రాజు, కొంపల్లి జగదీష్, కార్మిక విభాగం అధ్యక్షుడు ఉప్పల్ శ్రీను, అశోక్ కుమార్, రామస్వామి, సంరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
