తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: సిద్దిపేట  రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా, వారి పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటానని ప్రముఖ నాయకులు వంగ రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సిద్ధిపేట ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం ఎదుర్కొంటున్న కరెంట్, సాగునీటి ఇబ్బందులపై ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీలకు అతీతంగా నిర్వహించిన భారీ రైతు ర్యాలీలో పాల్గొని రైతుల గొంతుకగా నిలిచారు. అనంతరం విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గౌరవ విద్యుత్ శాఖ ఎస్‌ఈ (SE) గారికి వినతిపత్రం అందజేశారు.వంగ రాజేశ్వర్ రెడ్డి డిమాండ్లు మరియు వ్యాఖ్యలు ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కేవలం 10 గంటల కరెంట్ మాత్రమే వస్తుండటంతో రైతులు పంటలు కాపాడుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోతున్న పంటలను కాపాడాలంటే రైతులకు కనీసం 18 గంటల పాటు నిరంతర విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. సిద్ధిపేట చుట్టుపక్కల కాల్వలు ఉన్నప్పటికీ, చెరువుల్లోకి సాగునీరు చేరకపోవడం దురదృష్టకరమన్నారు.
రైతు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు పక్కనబెట్టి నిలబడటమే తన బాధ్యతని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, అందుబాటులో ఉన్న నీటి వనరులను వినియోగిస్తూ చెరువులు, కుంటలను నీటితో నింపేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరారు.