తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫామ్‌హౌస్ సమీపంలో దళితులు నడిచారని పేర్కొంటూ బీఆర్ఎస్ నాయకులు పసుపు నీళ్లతో శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం అత్యంత అవమాన కరమైన, అమానవీయమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ కాటేదాన్–మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు ఎన్. ధనుంజయ తీవ్రంగా ఖండించారు.స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా, రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన నేపథ్యంలో ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నడిచిన ప్రదేశాన్ని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తం చేయడం కుల వివక్షను ప్రతిబింబి స్తుందని అన్నారు. ఈ చర్య దళితులనే కాకుండా భారత రాజ్యాంగం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అవమానించ డమేనని పేర్కొన్నారు. దళితులు ఈ దేశ పౌరులని, వారికి ఎక్కడ నడవాలి, ఎక్కడ నిలబడాలి అనే హక్కులను ఎవరూ ప్రశ్నించలేరని స్పష్టం చేశారు. దళితులు నడిచినందుకు శుద్ధీకరణ చేయడం వంటి చర్యలు సామాజిక సమానత్వానికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. ఇలాంటి చర్యలను ఖండించకుండా ప్రోత్సహిస్తే దళితుల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుందని ధనుంజయ అన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చర్యనైనా సహించబోమని, రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. కుల వివక్షకు తావులేని సమాజ నిర్మాణం, సమానత్వం, దళితుల ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని పిలుపునిచ్చారు.
