తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై జరిగిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎర్రవెల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్‌హౌస్ వెలుపల దళిత సమాజం, కాంగ్రెస్ శ్రేణులు శాంతియుతంగా చావు డప్పు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఈ నిరసన ముగిసిన అనంతరం దళితులు నడిచిన ప్రజా రహదారిని అపవిత్రమైందనే భావనతో కొంతమంది వ్యక్తులు పసుపు నీళ్లు చల్లి శుద్ధీకరణ కార్యక్రమం చేపట్టడం తీవ్ర కలకలం రేపింది. ఈ నిరంకుశ, వివక్ష పూరిత చర్యపై టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చిన్నకోడూరు మండల కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ అనాగరిక, అమానుష ఘటనకు పాల్పడిన వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఇతర కఠిన చట్టాల కింద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిన్నకోడూరు పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు సమర్పించారు. సమాజంలో ఇటువంటి వివక్ష పూరిత భావజాలాన్ని ప్రోత్సహించే వారిపై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంద శ్రీకాంత్, మెట్‌పల్లి ఉపసర్పంచ్ మహేష్, యూత్ కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షుడు ఉడుత జయంత్, కాంగ్రెస్ నాయకులు మంద మనోజ్ తదితరులు పాల్గొని పోలీసులకు ఫిర్యాదు ప్రతిని అందజేశారు.