తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) శంషాబాద్ జోన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ. 5 లకే భోజనం అందించే ఇందిరమ్మ క్యాంటీన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని ఐఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు వనంపల్లి జైపాల్ రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం, సీపీఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్రా గిరి కోరారు. ఈ మేరకు శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో రాష్ట్ర పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుగ్గిళ్ళ శ్రీధర్ బాబును కలసి వినతిపత్రం సమర్పించారు..ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి ఉపాధి కోసం వేలాది మంది వలస కార్మికులు శంషాబాద్‌కు వచ్చి నివసిస్తున్నారని తెలిపారు. లేబర్ అడ్డాల వద్ద సరిపడా ఉపాధి దొరకక, మరోవైపు ఆకలి తీర్చుకోలేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేలాదిగా ఉన్న పేద, వలస కార్మికుల ఆకలి తీర్చేందుకు శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద రూ. 5 లకే భోజన కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని మంత్రిని అభ్యర్థించారు. ఈ వినతిపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు… శంషాబాద్ ప్రాంతంలో త్వరలోనే రూ. 5 ల భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
