తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నేటి సమాజంలో క్రమశిక్షణా రాహిత్యం, భయాందోళనలు పెరిగిపోవడానికి పాఠశాలల్లో, ఇళ్లలో పిల్లల పెంపకంపై పర్యవేక్షణ తగ్గడమే ప్రధాన కారణమని వినుకొండ సర్కిల్ ఇన్ స్పెక్టర్ (సిఐ) సింగిరేసి సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల బాధ్యతలపై ఆయన రాసిన ఒక విజ్ఞప్తి పత్రం ప్రస్తుతం విపరీతంగా చర్చనీయాంశమవుతోంది. బడిలో భయం లేదు… ఇంట్లో నియంత్రణ లేదు! :

ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న పాఠశాలల్లో నేడు విద్యార్థుల ప్రవర్తన ఆందోళనకరంగా మారుతోందని సిఐ పేర్కొన్నారు. చిన్న వయసులోనే వింత కటింగ్ స్టైల్స్, చినిగిన జీన్స్ వేసుకుని రావడం, టీచర్లను సైతం లెక్కచేయకపోవడం వంటి వైఖరి పెరుగుతోందన్నారు. “కొట్టొద్దు, తిట్టొద్దు, ప్రశ్నించొద్దు” అనే ధోరణి వల్ల ఉపాధ్యాయులు నిస్సహాయ స్థితికి చేరుకున్నారని, తప్పు చేసినప్పుడు మందలించే హక్కు గురువుకు లేకపోవడం వల్లే రేపటి పౌరులు రౌడీలుగా, నేరస్థులుగా మారుతున్నారని హెచ్చరించారు.

పిల్లలు చెడిపోవడంలో 40 శాతం తల్లిదండ్రులదే బాధ్యత:

పిల్లల ప్రవర్తన దిగజారడానికి ఫోన్లు, మీడియా, స్నేహితులు 60 శాతం కారణమైతే, తల్లిదండ్రుల అతి గారాబం, అజ్ఞానం 40 శాతం కారణమవుతున్నాయని సర్వే ఆధారితంగా స్పష్టం చేశారు. నేటి తరం పిల్లల్లో దాదాపు 70 శాతం మంది ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడానికి, బయటకు వెళ్లి సరుకులు తేడానికి నిరాకరిస్తున్నారు. వేళాపాళ లేని నిద్ర, జంక్ ఫుడ్ అలవాట్ల వల్ల 10వ తరగతి దాటేలోపే అల్సర్, బీపీ, కంటి సమస్యలు, శారీరక రుగ్మతలు ఎదుర్కొంటున్నారు. ప్రతిష్టలకు పోయి పిల్లలను గారాబం చేయడం వల్ల కష్టం, డబ్బు, సమయం విలువ తెలియక 15 ఏళ్లకే వ్యసనాలకు, నేరాలకు అలవాటుపడుతున్నారు.

పిల్లలకు నేర్పించాల్సింది శ్లోకాలు మాత్రమే కాదు… బాధ్యతలు!

సాంప్రదాయం అంటే కేవలం పూజలు, ప్రార్థనలు చేయడం మాత్రమే కాదని… బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, ఓర్పు, దాతృత్వం, మానసిక దృఢత్వం అలవాటు చేయడమే నిజమైన సంస్కృతి అని సిఐ గుర్తుచేశారు.ఈ మెసేజ్ చదివి అందరూ మారకపోవచ్చు, కానీ కనీసం ఒక్కరిలో మార్పు వచ్చినా నా ప్రయత్నం నెరవేరినట్లే” అని సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులంతా ఇప్పటికైనా కళ్ళు తెరిచి పిల్లలకు సరైన మార్గదర్శనం చేయాలని ఆయన కోరారు.