తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో పర్యావరణ పరిరక్షణకు అద్దంపట్టేలా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆదర్శ కాలనీకి చెందిన ఏర్వ కుమారస్వామి నివాసంలో ఆయన కూతురు చేతులతో స్వయంగా తయారు చేసిన పసుపు గణపతి విగ్రహానికి 21 రకాల పత్రాలతో (ఏకవింశతి పత్రపూజ) వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి కుడుములు, ఉండ్రాళ్ల పాయసాన్ని నివేదనగా సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్వ కుమారస్వామి మాట్లాడుతూ… “పర్యావరణానికి హాని కలిగించని పసుపు మరియు మట్టి వినాయక విగ్రహాలనే ప్రతి ఒక్కరూ పూజించాలి. రసాయన రంగులతో తయారు చేసే విగ్రహాల వల్ల జల వనరులు కలుషితమవుతాయి. మన సంప్రదా యాలను కాపాడుకుంటూనే, ప్రకృతిని పరిరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి ప్రకృతి సిద్ధమైన విగ్రహాలను ఆరాధించడం శుభపరిణామం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
