తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మాతా పార్వతీదేవి తన నలుగు పిండితో రూపు దిద్దుకున్న బాలుడికి ప్రాణముపోసి, తన స్నాన గృహానికి ద్వారపాలకుడిగా ఉంచింది. తల్లి ఆజ్ఞను శిరసావహించి, పరమశివుడిని సైతం అడ్డుకున్న ఆ దృఢ సంకల్పమే వినాయకుని తొలి శౌర్యానికి నిదర్శనం. ఆగ్రహించిన శివుడు త్రిశూలంతో బాలుడి శిరచ్ఛేదం చేయగా, పార్వతి విలాపంతో ఉత్తర దిశగా నిద్రించిన గజాసురుని శిరస్సును తెప్పించి, అమరత్వాన్ని, పునర్జన్మను ప్రసాదించారు. ఆదర్శవంతమైన పితృభక్తితోనే సకల గణాలకు ఆధిపత్యం! దేవతలందరికీ నాయకుడిని ఎన్నుకునే పోటీలో, “ముల్లోకాలను మొదట ఎవరు చుట్టి వస్తే వారే విజేత” అని శివుడు ప్రకటించాడు. కుమారస్వామి తన నెమలి వాహనంపై విశ్వమంతటా పరుగు తీస్తే, వినాయకుడు తన బుద్ధిబలంతో తల్లిదండ్రులైన శివపార్వతులే సర్వలోక స్వరూపాలని గుర్తించాడు. వారి చుట్టూ భక్తితో ప్రదక్షిణం చేసి, “తల్లిదండ్రులను పూజించడమే అత్యుత్తమ ధర్మం” అనే దివ్య సందేశాన్ని లోకానికి చాటి, ‘గణాధిపతి’గా పట్టాభిషేకం పొందాడు. ఏకదంతంగా మారి చరిత్ర సృష్టించిన గణనాథుడు వినాయకుడి ఏకదంత రూపం వెనుక అపారమైన త్యాగం మరియు ధర్మనిష్ఠ దాగి ఉన్నాయి. శివాజ్ఞను గౌరవిస్తూ పరశురాముని ఆయుధాన్ని తన దంతంతో స్వీకరించి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తైతే… వేద వ్యాసుడు చెప్పే మహాభారతాన్ని ఆగకుండా రాయడానికి తన దంతాన్ని విరిచి కలంగా మార్చడం మరొక ఎత్తు. ఈ ఘట్టం జ్ఞానం కోసం చేసే త్యాగం ఎంత గొప్పదో నిరూపిస్తుంది. మూషిక వాహనంపై వెళ్తున్న వినాయకుని రూపం చూసి చంద్రుడు అహంకారంతో నవ్వగా, ఆ అహంకారాన్ని అణచేందుకు “చవితి నాడు నిన్ను చూసినవారు నీలాపనిందలకు గురవుతారు” అని గణపతి శపించాడు. చంద్రుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ వేడగా, వినాయక చవితి నాడు కథ విని అక్షతలు ధరిస్తే ఆ శాపం నుండి ముక్తి లభిస్తుందని అభయమిచ్చాడు. భాద్రపద శుక్ల చతుర్థి నాడు ఆరంభమయ్యే ఈ పండుగ పర్యావరణ పరిరక్షణకు, సామూహిక వికాసానికి వేదిక. మట్టి గణపతులను ప్రతిష్టించి, 21 రకాల పత్రులతో పూజించి, నైవేద్యాలు సమర్పించడం ద్వారా సమస్త విఘ్నాలు తొలగి విజయం సిద్ధించాలని కోరు కుంటారు. దేవుని నిమజ్జనంతో పండుగను ఘనంగా ముగిస్తారు.