తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కాటేదాన్, మైలార్దేవపల్లి డివిజన్లలో ప్రతిష్ఠించే గణనాథులకు స్వాగతం పలికేందుకు ‘గణేష్ ఆగమన్’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. డివిజన్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో చేపట్టిన ఈ స్వాగత మహోత్సవంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, గణేశుడికి మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.
గత దశాబ్దకాలంగా భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్న వివిధ మండపాల నిర్వాహకులు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు ఉమ్మడిగా ఈ ‘గణేష్ ఆగమన్’ వేడుకను ఏర్పాటు చేశారు. ఈ కాంతివంతమైన సుందర కార్యక్రమంలో స్థానిక మహిళలు, పిల్లలు, పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొని విఘ్ననాయకునికి నీరాజనాలు అర్పించారు.
ఈ సందర్భంగా పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ— “భక్తులారా, ఏ అడ్డంకులకు భయపడకండి… ‘నేను మీతోనే ఉన్నాను’ అంటూ విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీ కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలి” అని ఆకాంక్షించారు. శివ-పార్వతుల ఆశీస్సులతో మీ అందరి ఇళ్లలోకి అడుగుపెడుతున్న శ్రీ గణనాథుడు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆయన కోరుకున్నారు.

