తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శంషాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సీపీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ శంషాబాద్ మండల కార్యదర్శి నర్ర గిరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులకు నివాళులు అర్పించి సీపీఐ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు రాచమల్ల యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాచమల్ల యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన వేలాది మంది త్యాగాలను స్మరించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ ప్రజలు, రైతుల సమస్యల కోసం ధైర్యంగా పోరాడిన మహా వీరవనితగా చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. ఆమె భూమి, పంట సమస్యలపై పోరాటం చేస్తున్న సమయంలో సీపీఐ నాయకులు రవి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూం మొహియుద్దీన్ తదితరులు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఐలమ్మ పోరాటం మహిళల్లో స్ఫూర్తిని నింపిందన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన కమ్యూనిస్టు యోధుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల హక్కులు, రైతాంగ సమస్యలు, మహిళల రక్షణ కోసం ఐలమ్మ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సెప్టెంబర్ 17న హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉదయం 11 గంటలకు నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నాయకులు కోరారు..కార్యక్రమంలో సీపీఐ శంషాబాద్ మండల నాయకులు గిలకరాజు, శ్రీనివాస్, దండి రవికుమార్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
