తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలార్దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని దుర్గా నగర్‌లో వర్షం కురిస్తే చాలు.. కాలనీ వాసులకు కష్టాలు మొదలవుతున్నాయి. టీఆర్‌జీ హాస్పిటల్ వెనుక వైపు ఇళ్ల ముందు భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి, బయట నుంచి ఇళ్లలోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క రోజు సమస్య కాదు.. నెల రోజుల సమస్య కాదు.. ఏళ్ల తరబడి ఇదే పరిస్థితి! వర్షం వచ్చిన ప్రతిసారి వరదనీటితో అవస్థలు పడుతున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఇబ్బందులను అధికారులు కళ్లారా చూసి కూడా స్పందించక పోవడం పట్ల అసంతృప్తి వ్యక్తమవుతోంది.ప్రజల సమస్య పరిష్కరించడమే అధికారుల బాధ్యత.. ప్రజల గోడు వినడమే ప్రజాప్రతినిధుల కర్తవ్యం. ఇకనైనా నిద్రావస్థ వీడి దుర్గా నగర్‌లో పర్యటించి వరదనీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు కోరుతున్నారు.సమస్య పరిష్కారం కోసం ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేయాలి? అధికారులు వెంటనే స్పందించకపోతే జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా ధర్నా చేపట్టి తమ నిరసనను తెలియజేస్తామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ఇబ్బందులకు ముగింపు పలికి, దుర్గా నగర్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.