తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని బీఆర్ఎస్ అత్తాపూర్, రాజేంద్రనగర్ సర్కిళ్ల ఇంచార్జ్ కోలన్ సుభాష్ రెడ్డి సూచించారు. వినాయక నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి పల్లె చెరువు, పత్తికుంట చెరువులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా డివిజన్ల నాయకులతో కలిసి నిమజ్జనం కోసం ప్రభుత్వం చేపట్టిన ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. పల్లె చెరువులో నిమజ్జనానికి తగిన స్థాయిలో ఏర్పాట్లు కనిపించడం లేదని సుభాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఏర్పాటు చేసిన నిమజ్జన కొలను పరిమితంగా ఉందని పేర్కొన్నారు.
వినాయక నిమజ్జనం భక్తి, ఆనందం, ఐక్యతకు ప్రతీకగా నిలవాలని, అయితే సరైన ఏర్పాట్లు లేకపోతే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిమజ్జనానికి ముందుగానే చెరువుల్లోని గుర్రపు డెక్కను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేవారని, అవసరమైన సంఖ్యలో భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు, పోలీసు సిబ్బందిని అందుబాటులో ఉంచేవారని తెలిపారు.
అదేవిధంగా భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది, విగ్రహాలు సురక్షితంగా నిమజ్జనం చేసే విధంగా నీటి కొలనులను ఏర్పాటు చేసేవారని గుర్తు చేశారు.
పల్లె చెరువుతో పాటు పత్తికుంట చెరువులో కూడా నిమజ్జన ఏర్పాట్లను మరింత విస్తృతం చేయాలని సుభాష్ రెడ్డి కోరారు. అవసరమైన మేరకు క్రేన్ల సంఖ్యను పెంచడంతో పాటు తాగునీటి సౌకర్యం, వైద్య సిబ్బంది, గజ ఈతగాళ్లు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.ఎండ, వర్షం వంటి పరిస్థితుల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, స్థానిక సిబ్బందితో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వినాయక నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్, మాజీ కౌన్సిలర్ రమేష్ ముదిరాజ్, మైలార్ దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షులు గుమ్మడి కుమార్, హైదరగూడ అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రాము యాదవ్, మైసిరెడ్డి రాఘు యాదవ్, రాజేష్ యాదవ్, ఎడ్లకాడి సూర్యం, జగదీష్, రామస్వామి, జంపుల భగవాన్ దాస్, చిరంజీవి, ఉమారెడ్డి, తిరుపతి రెడ్డి, పచ్చ శ్రీనివాస్, కృష్ణ ముదిరాజ్, క్రాంతి, సింహాచలం, రిషి తదితరులు పాల్గొన్నారు.
