తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : చిన్నతనంలో నేర్చుకున్న భద్రతా పాఠాలు జీవితాంతం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో లిటిల్ కడిల్స్ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ చిన్నారులకు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నార్సింగి మున్సిపల్ సర్కిల్ పరిధిలోని నెక్నంపూర్ డివిజన్ పుప్పలగూడ బాలాజీ నగర్‌లో ఉన్న పాఠశాల విద్యార్థులు విద్యా విషయక క్షేత్ర పర్యటనలో భాగంగా లంగర్ హౌస్ అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది సమాజ రక్షణలో నిర్వహిస్తున్న కీలక పాత్రను చిన్నారులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణాలు, ఆస్తులను రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది చేపట్టే సాహసోపేత చర్యలను అధికారులు చిన్నారులకు సులభమైన రీతిలో వివరించారు. ఫైర్ ఇంజిన్ పనితీరు, అత్యవసర సమయాల్లో స్పందించే విధానం, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా నియమాలను చిన్నారులకు ఎంతో ఓపికగా వివరించారు. పిల్లలతో ఆప్యాయంగా మెలుగుతూ వారికి అవగాహన కల్పించడంతో చిన్నారుల్లో ఉత్సాహం, ఆసక్తి మరింత పెరిగింది. అప్రమత్తతే తొలి రక్షణ.. అవగాహనే ప్రాణ రక్షణకు ఆయుధం” అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు అందించారు. పుస్తకాల్లో చదివే విషయాలను ప్రత్యక్షంగా చూసి తెలుసుకునే అవకాశం కల్పించడం ద్వారా విద్యార్థుల్లో జ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, భద్రతపై చైతన్యం పెంపొందుతుందని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.చిన్నారులకు ఆప్యాయంగా అవగాహన కల్పించిన లంగర్ హౌస్ ఫైర్ స్టేషన్ అధికారి సంతోష్ కుమార్, సిబ్బంది మహేష్, తాహిర్ అలీ ఖాన్, కోమల్, కమలేశ, విజయ్, రవి తదితరులకు పాఠశాల ప్రిన్సిపాల్ హర్షిత సక్సేనా, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి క్షేత్ర పర్యటనలు చిన్నారుల్లో కేవలం విద్యా జ్ఞానాన్నే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో ధైర్యంగా, బాధ్యతగా వ్యవహరించే స్ఫూర్తిని పెంపొందిస్తాయని నిర్వాహకులు తెలిపారు.