తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యవంతమైన సమాజమే బలమైన భవిష్యత్తుకు పునాది అనే సందేశంతో శివరాంపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాల వారోత్సవాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లులు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.కార్యక్రమానికి సూపర్‌వైజర్లు పద్మజ, కోమల్ ముఖ్య అతిథులుగా హాజరై పోషకాహారం ప్రతి కుటుంబ జీవితంలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తుందో వివరించారు. ముఖ్యంగా చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణకు పౌష్టికాహారం ఎంతో అవసరమని తెలిపారు. గర్భిణులు, బాలింతలు కూడా సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని సూచించారు.“ఈరోజు పిల్లలకు అందించే మంచి ఆహారమే రేపటి ఆరోగ్యకరమైన తరానికి పెట్టుబడి” అనే స్ఫూర్తిదాయక సందేశంతో తల్లిదండ్రుల్లో అవగాహన పెంచారు. ఇంటి నుంచే పోషకాహార అలవాట్లు ప్రారంభిస్తే చిన్నారులు ఆరోగ్యంగా ఎదిగి సమాజానికి బలమైన పునాదిగా నిలుస్తారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు జయశ్రీ, రత్న, సంగీత, సుమిత్ర, కల్పన, సహాయకురాలు సుశీలతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పాల్గొన్నారు. పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
