తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ఆమనగల్ పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రూ.17.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 50 పడకల ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రి భవన నిర్మాణ పురోగతి, వివిధ విభాగాల ఏర్పాట్లు, పనుల వేగం, నాణ్యత ప్రమాణాలపై అధికారులు, గుత్తేదారుతో ఎమ్మెల్యే చర్చించారు. నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా నిర్ణీత గడువులోపు నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, లిఫ్టు, మార్చురీ, డైట్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆసుపత్రి ఆవరణను ముందున్న రహదారి కంటే ఎత్తుగా నిర్మించాలని, సీహెచ్‌సీ భవనాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అసంపూర్తి పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు.
ఆమనగల్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ఆధునిక వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సీహెచ్‌సీకి అవసరమైన సిబ్బంది క్యాడర్ స్ట్రెంత్ అంశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
