తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హనుమకొండ: తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతి కార్యక్రమాన్ని హనుమకొండలో ఘనంగా నిర్వహించారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ పాల్గొని కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అంబేద్కర్ కూడలి, హంటర్ రోడ్‌లోని వీవర్స్ హాస్టల్ వద్ద ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం తౌటం ఝాన్సీ రాణి రవీందర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో తన సొంత ఇల్లు జలదృశ్యాన్ని ఉద్యమానికి కేటాయించి, ఉద్యమకారులకు ఆశ్రయం కల్పించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ప్రజా ఉద్యమాల కోసం వ్యక్తిగత ఆస్తులు, పదవులను సైతం త్యాగం చేసిన ఆయన సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ప్రభుత్వాలను కోరారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు, ప్రముఖులు, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
