సిద్దిపేట న్యూస్: సిద్దిపేట జిల్లా రెవెన్యూ అధికారుల రికార్డుల మాయాజాలం, వారు సమర్పించిన నివేదికల్లోని అబద్ధాల పుట్ట సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైంది. చిన్నకోడూరు మండలం మెడిపల్లి గ్రామంలోని ముఖిస పాపిరెడ్డి మరియు సత్తనారాయణ రెడ్డికి సంబంధించిన వివాదాస్పద ప్రభుత్వ సర్వే నంబర్లు 11, 76, 96, 97 భూములపై సిద్దిపేట ఆర్‌డీఓ (RDO) కార్యాలయం సమర్పించిన నివేదిక పూర్తిగా తప్పుడు సమాచారంతో కూడుకున్నదని అన్నారు సోమవారం సిద్దిపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో బాధితుడు నేరుగా జిల్లా కలెక్టర్‌ను కలిసి, ఆర్టీఐ (RTI) సర్టిఫైడ్ కాపీలతో అధికారుల ఘోర తప్పిదాలను నిరూపించడం జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

విచారణలో తేలిన షాకింగ్ నిజాలు
ఎమ్మార్వో ఆఫీసులో అసలు ఫైళ్లే లేవు చిన్నకోడూరు ఎమ్మార్వో (MRO) కార్యాలయంలో ఈ భూముల ఎన్‌ఓసీ (NOC) కి సంబంధించిన ఎలాంటి రికార్డులు లేదా అసలు ఫైళ్లే లేవని సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా తీసుకున్న అధికారిక కాపీల ద్వారా రుజువైంది. అసలు కార్యాలయంలో ఫైలే లేనప్పుడు, ఆర్‌డీఓ ఏ రికార్డులను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారో అర్థం కావడం లేదని బాధితుడు ఆరోపించారు.
మోటార్ అర్జీనే ల్యాండ్ ప్రొసీడింగ్స్ ఆర్‌డీఓ కార్యాలయం నుండి తీసుకున్న రికార్డులను పరిశీలించగా, నివేదికలో చూపిన డీఆర్ (DR) నంబర్లు పూర్తిగా వేరే మండలానికి చెందినవిగా తేలింది. మరీ ఘోరంగా, అధికారులు కలెక్టర్‌కు పంపిన ప్రతిపాదనల్లో రావురుకుల గ్రామానికి చెందిన కుంభం రాజి రెడ్డి’ అనే వ్యక్తి తన బావి మోటార్ కనెక్షన్ గురించి ఇచ్చుకున్న అర్జీ సమాచారం ఉండడం గమనార్హం. ఒక సాదాసీదా మోటార్ అర్జీ నంబర్లను తీసుకొచ్చి, ఇక్కడ మెడిపల్లి భూముల మినహాయింపు ప్రొసీడింగ్స్‌గా అధికారులు చూపించారు.
రిఫరెన్స్ లేఖ C/805/2017 లో రికార్డుల తారుమారు: కలెక్టర్‌కు ఆర్‌డీఓ పంపిన ప్రొసీడింగ్ ప్రపోజల్స్ రిఫరెన్స్ లేఖ నెం. C/805/2017 లో పూర్తిగా వేరే గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని చొప్పించి, ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించేలా తప్పుడు నివేదికను సృష్టించారు.

సమగ్ర విచారణకు డిమాండ్
ఎలాంటి క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా, ఆఫీసులో అసలు ఫైళ్లే లేకుండా, వేరే మండలం మోటార్ అర్జీల నంబర్లను వాడుతూ కలెక్టర్ గారిని సైతం తప్పుదోవ పట్టించిన సిద్దిపేట ఆర్‌డీఓ (RDO) పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారుడు డిమాండ్ చేశారు. ఈ భూములపై నిష్పక్షపాతంగా మరో ఉన్నతాధికారితో సమగ్ర విచారణ (Re-enquiry) జరిపించి తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు సమర్పించిన అర్జీలో కోరారు.