• గవర్నర్ కోటాలో నామినేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి: ఉస్మానియా విద్యార్థి నాయకుడు చేరాల వంశీ
• బీసీ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులకు గుర్తింపు ఇవ్వాలి

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: బీసీ ఉద్యమ నాయకుడు గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు చేరాల వంశీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీల హక్కుల సాధనతో పాటు విద్య, వైద్యం, సామాజిక న్యాయం వంటి రంగాల్లో గుజ్జ సత్యం చేస్తున్న సేవలను గుర్తించి ఆయన పేరును ఎమ్మెల్సీ పదవికి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

విద్యార్థుల సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు, ఉపాధి అవకాశాలు, బీసీ రిజర్వేషన్ల వంటి అంశాలు యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్నాయని చేరాల వంశీ పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.

గుజ్జ సత్యం బీసీ వర్గాల హక్కుల కోసం వివిధ వేదికలపై తన గళాన్ని వినిపిస్తూ, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. విద్యా రంగంపై అవగాహనతో పాటు సామాజిక సమస్యల పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రజా జీవితంలో మరిన్ని అవకాశాలు కల్పించడం ద్వారా యువత, విద్యార్థుల సమస్యలు మరింత బలంగా ప్రస్తావించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

బీసీ యువతకు అవకాశాలు పెరగాలి

బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉన్నత విద్యలో సమాన అవకాశాలు, ఉద్యోగ నియామకాల్లో న్యాయం, పెండింగ్‌లో ఉన్న విద్యా సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని చేరాల వంశీ పేర్కొన్నారు. బీసీ వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు.

గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ పదవి కల్పించాలనే ప్రతిపాదనకు తన మద్దతు తెలియజేస్తున్నట్లు చేరాల వంశీ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్‌కు సంబంధించిన రాజ్యాంగపరమైన అర్హతలు, నిబంధనలను పరిగణనలోకి తీసుకుని గుజ్జ సత్యం పేరును పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు డా.రమేష్,DSF రాష్ట్ర అధ్యక్షులు బరిగాల రాజు,TPVS రాష్ట్ర కార్యదర్శి సామల సాయితేజ,బీసీ విద్యార్థి సంఘం నాయకులు జ్ఞానేష్,శ్రీరాం, హరీశ్, ప్రకాష్,దినేష్, ప్రవీణ్, శ్రీనివాస్, రవి మరియు తదితరులు పాల్గొన్నారు*

Avatar photo

By Murthy