• కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం ప్రమాణస్వీకార సభలో ఏకగ్రీవ తీర్మానం
కామారెడ్డి: తెలంగాణ జాతిపితగా గుర్తింపు పొందిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వారసురాలు డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించాలని కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు అక్టోబర్ 12న నిర్వహించిన జిల్లా పద్మశాలి సంఘం నూతన కమిటీ ప్రమాణస్వీకార సభలో తీర్మానం నంబర్ 1/2026ను ఏకగ్రీవంగా ఆమోదించారు.

జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనరసింహులు అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షుడు వళ్లకటి రాజ్ కుమార్, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్, రాష్ట్ర హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ దూడం వెంకటరమణతో పాటు 24 మండలాలు, మూడు పట్టణాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా కమిటీ సభ్యులు, సుమారు 800 మంది సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమోదించిన తీర్మానంలో డా. పవిత్ర వాణి బాపూజీకి ఎమ్మెల్సీ పదవి కల్పించడం ద్వారా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు, త్యాగాలకు తగిన గుర్తింపు లభిస్తుందని సంఘం అభిప్రాయపడింది. ఇది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం మాత్రమే కాదని, రాష్ట్రంలోని పద్మశాలి సమాజ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని తీర్మానంలో పేర్కొన్నారు.
తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలు హర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ తీర్మాన పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించి, డా. పవిత్ర వాణి బాపూజీకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరాలని సభ నిర్ణయించింది. జిల్లా అధ్యక్షుడు సిరిగాద లక్ష్మీనరసింహులు ఆధ్వర్యంలో ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సంఘం నాయకులు పేర్కొన్నారు.
