తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యత, పూల పండుగ వైభవాన్ని చాటిచెప్పేలా చుక్కాపూర్లో సద్దుల బతుకమ్మ సంబరాలు
కామారెడ్డి జిల్లా, చుక్కాపూర్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలను కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో మహిళలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎదుట మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు.

తంగేడు, గునుగు, బంతి, చామంతి, మల్లె తదితర రంగురంగుల పుష్పాలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. గౌరీ దేవిని ప్రతిష్ఠించి చిన్న బతుకమ్మలను కూడా సిద్ధం చేశారు. గ్రామ ప్రధాన కూడలిలో బతుకమ్మలను ఉంచి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు వలయాకారంలో చేరి బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.
ఈ వేడుకల్లో చిన్నారులు, పిల్లలు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ పాటలకు అనుగుణంగా దాండియా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనగా, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనంతరం బతుకమ్మలను గ్రామ శివారులోని ఊర చెరువులో నిమజ్జనం చేశారు. పూర్వపు ఆనవాయితీ ప్రకారం మహిళలు ఒకరికొకరు పసుపు, కుంకుమలు అందించుకుని, ప్రసాదాలను పంచుకున్నారు. పరస్పర ఆప్యాయతలు, సంతోషాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా ముగించారు.
