తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని మైలార్ దేవ్‌పల్లి డివిజన్లో నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యు. విజయ్ కుమార్ దసరా సంబరాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొమ్మిది రోజులపాటు భక్తులు ఎంతో నిష్ఠతో అమ్మవారిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు చేపట్టి ఆధ్యాత్మిక చైతన్యాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు.
అదేవిధంగా, మైలార్ దేవ్‌పల్లి డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్‌గా నిలవాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. డివిజన్లోని కాలనీలు అభివృద్ధి చెందాలని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలన పిలుపు నిచ్చారు .“అందరూ బాగుండాలి… అందులో నేనుండాలి” అనే సందేశంతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
