తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : నగరంలోని కాటేడాన్   ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు నిర్వహణ లేక నిరుపయోగంగా మారుతున్నాయని, ప్రజాధనం వృథా కాకుండా అధికారులు వెంటనే స్పందించాలని తెలంగాణ రక్షణ సేన నాయకుడు తిమ్మప్ప కురుమ డిమాండ్ చేశారు. కట్టేదాన్‌లోని జీహెచ్‌ఎంసీ ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఫుట్‌వేర్ కేంద్రం ప్రస్తుతం ప్రజలకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడటం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ​ప్రస్తుతం ఈ కేంద్రం వినియోగం కనీసం 1 శాతం కూడా లేదని ఆయన స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో, ఈ కేంద్రాన్ని ప్రజలు నిత్యం ఎక్కువగా ఉపయోగించుకునే మరో రద్దీ ప్రాంతానికి మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు ఇబ్బందులు : ఫుట్‌ఓవర్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన లిఫ్ట్ ఎప్పట్నుంచో మూసివేసి ఉండటం పట్ల తిమ్మప్ప కురుమ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు రోడ్డు దాటేందుకు ఈ లిఫ్ట్ ఎంతో ఉపయోగపడాల్సి ఉండగా, ఇది మూతపడటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అంతేకాకుండా, ఫుట్‌ఓవర్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి, పర్యవేక్షణ లోపంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొందని విమర్శించారు.

ప్రజల సౌలభ్యం కోసం కోట్ల రూపాయలతో నిర్మించిన సదుపాయాలను సంరక్షించాల్సిన బాధ్యత సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎంతైనా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు తక్షణమే పరిశీలన జరిపి ఈ సమస్యలను పరిష్కరించాలని తిమ్మప్ప కురుమ కోరారు. మూసివేసిన లిఫ్ట్‌ను వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. ​బ్రిడ్జి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ​ఫుట్‌వేర్ కేంద్రాన్ని ప్రజలకు నిజంగా ఉపయోగపడే మరో అనువైన ప్రాంతానికి మార్చాలి.ప్రజాధనం వృథా కాకుండా ప్రభుత్వ సదుపాయాలు ప్రజలకు పూర్తిస్థాయిలో ఫలించేలా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.

You missed