తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మైలర్ దేవ్పల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శ కాలనీలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ దేవాలయం అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో, వైభవంగా ముగిశాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, చివరి రోజు నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు.ఈ సందర్భంగా అమ్మవారికి సమర్పించిన పది చీరలను వేలం పాట నిర్వహించగా, పలువురు మహిళలు భక్తితో వాటిని దక్కించుకున్నారు. చీరలను పొందిన మహిళలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు సత్కరించి, అమ్మవారి చీరలను అందజేశారు.
అనంతరం భక్తుల అమ్మవారి నామస్మరణలు, పాటలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు ఉత్సాహంగా సాగింది. ఆదర్శ కాలనీ పరిసరాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, భక్తుల జయజయధ్వానాల మధ్య అమ్మవారిని పల్లె చెరువులో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, అమ్మవారి ఆశీస్సులతో కాలనీలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతోపాటు, ఐకమత్యం, సోదరభావం, సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల విజయవంతానికి సహకరించిన భక్తులకు, మహిళలకు, కాలనీ ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఉత్సవాలు ముగిసినా, ఆమె ఆశీస్సులు ప్రతి ఇంటా ఆనందం, శాంతి, శ్రేయస్సును నింపాలని ఆకాంక్షించారు.
