తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : రాజేంద్రనగర్ నియోజకవర్గం కాటేదాన్ డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ పోచమ్మ దేవాలయం వద్ద దీపావళి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాటేదాన్ డివిజన్ అధ్యక్షుడు ఎస్. వెంకటేష్‌తో పాటు పలువురు ముఖ్య నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం ఎస్. వెంకటేష్ మాట్లాడుతూ దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో చీకట్లను తొలగించి సుఖ సంతోషాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. దీపావళి అమావాస్య సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం అందించేందుకు ముందుకు వచ్చిన దాతల సేవాభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల నిర్వహణతో సమాజంలో సోదరభావం, ఐక్యత మరింత పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు సెంట్రింగ్ శంకర్, మల్లేష్, కృష్ణ, బాయికాడి అంజప్ప, టీవీ9 శ్రీను, భాగ్యమ్మ, మోహన్, శివ, శ్రీను, ఉదయ్, రాజు, మణికుమార్ తదితరులు పాల్గొన్నారు.
