తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం చేపట్టిన ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమాన్ని రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మండలంలో ఘనంగా నిర్వహించారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకలకు రాజేంద్రనగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నూతనంగా ఇళ్లు మంజూరై, గృహప్రవేశాలు పూర్తి చేసుకున్న నిరుపేద కుటుంబాల ఇళ్ల వద్ద ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ స్వయంగా దీపాలు వెలిగించారు. అనంతరం లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహాల్లో దీపాలు వెలిగించడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా అర్హులైన పేదలకు ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. సొంతింటిని నిర్మించుకుని ఆనందంగా జీవిస్తున్న పేద కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పేదల ఇళ్లలో దీపావళి వెలుగులు నింపడమే ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
