• శ్రీపతి శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానం – రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంఘాలు, అనుబంధ సంఘాల సంపూర్ణ మద్దతు
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమానికి, విద్యా, వైద్య, సామాజిక సేవా రంగాలకు విశేషంగా కృషి చేస్తున్న గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (BSMAT) రాష్ట్ర ప్రతినిధి బృందం ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది.
బీఎస్ఎంఏటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎంఏటీ ప్రతినిధులు, వివిధ జిల్లాల సంఘాల నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు గుజ్జ సత్యం అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, గుజ్జ సత్యం బీసీ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తూ బీసీల హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం నిరంతరం పోరాడుతున్నారని అన్నారు. విద్యారంగంలో, ముఖ్యంగా ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఇలాంటి సేవాభావం, సామాజిక బాధ్యత కలిగిన నాయకుడికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఎస్ఎంఏటీ ప్రతినిధులు, జిల్లా సంఘాలు, అనుబంధ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని గుజ్జ సత్యంకు మద్దతుగా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక వ్యక్తికి ఇచ్చే మద్దతు కాదని, బీసీ ఉద్యమానికి, విద్యారంగ సేవలకు ఇచ్చే గౌరవమని స్పష్టం చేశారు.
సమావేశంలో ప్రతినిధులు మాట్లాడుతూ, గుజ్జ సత్యం బీసీ వర్గాల అభ్యున్నతి, విద్యా, ఉపాధి, రాజకీయ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ విద్యాసంస్థల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో, బడ్జెట్ పాఠశాలల పరిరక్షణ కోసం పనిచేయడంలో ఆయన చొరవ ప్రశంసనీయమన్నారు.
విద్యారంగంతో పాటు వైద్య, సామాజిక సేవా రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి, బీసీ వర్గాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా గుజ్జ సత్యంకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశానికి బీఎస్ఎంఏటీ రాష్ట్ర కార్యదర్శి జె. మల్లారెడ్డి, రాష్ట్ర కోశాధికారి జె. శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ డా. పి. జాలంధర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు దయాకర్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, గుజ్జ సత్యం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి, జిల్లా కోశాధికారి మునీందర్రావుతో పాటు షఫీ, భరత్ గౌడ్, భీష్మారెడ్డి, రఫీద్దీన్, సికిందర్, అస్లాం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గుజ్జ సత్యంకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ద్వారా బీసీ ఉద్యమానికి, విద్యారంగ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని బీఎస్ఎంఏటీ రాష్ట్ర ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.
