• సంఘ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి

• చేనేత పరిశ్రమ అభివృద్ధికి సమిష్టి కృషి అవసరం: మేడం రామకృష్ణ

జోగులాంబ గద్వాల: మల్తకల్ మండలం బూడిదపాడు గ్రామంలోని శ్రీ దివ్య చేనేత సహకార సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొంకతి ఆంజనేయులుతో పాటు నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లను తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడం రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మేడం రామకృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చేనేత సహకార సంఘాల ఎన్నికల్లో బూడిదపాడు గ్రామ శ్రీ దివ్య చేనేత సహకార సంఘం అధ్యక్షుడు, డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. సంఘం మరింత బలోపేతం కావడానికి సభ్యులంతా ఐక్యంగా పనిచేయాలని, చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం, పరిశ్రమ పరిరక్షణ కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పులిపాటి ఆంజనేయులు, పులిపాటి రంగన్న, చిన్ని నాగరాజు, పులిపాటి నాగప్ప, నీలి లక్ష్మీనారాయణ, పగడాకుల జగన్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy