తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జీహెచ్‌ఎంసీ పరిధిలోని లక్షలాది కుటుంబాలపై భారీ ఆర్థిక భారం మోపేలా ప్రతిపాదించిన క్యూర్ బిల్లు–2026ను ప్రభుత్వం వెంటనే ఉపసం హరించుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు, గ్రామాల ప్రజలు, ప్రతి ఇంటి యజమాని అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రతిపాదిత క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ (సీవీఎస్) అమల్లోకి వస్తే ప్రస్తుతం అమల్లో ఉన్న యాన్యువల్ రెంటల్ వాల్యూ (ఏఆర్వీ) విధానం రద్దై, ఆస్తి పన్ను భారీగా పెరిగే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలు, ఉద్యోగులు, పెన్షనర్లు, సాధారణ గృహ యజ మానులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడు తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలపై అదనపు పన్ను భారం మోపే ఈ ప్రతిపాదనను అడ్డుకునేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రతి కాలనీ సంక్షేమ సంఘం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటి యజమాని తమ అభ్యంత రాలను ఈ నెల 24వ తేదీలోపు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కార్యాలయానికి ఆన్‌లైన్ లేదా ప్రత్యక్షంగా వినతిపత్రాల రూపంలో భారీ ఎత్తున సమర్పించాలని ఆమె కోరారు. ప్రధాన డిమాండ్లు : క్యూర్ బిల్లు–2026లోని ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న ఏఆర్వీ ఆధారిత ఆస్తి పన్ను విధానాన్నే కొనసాగించాలి. ప్రజలపై అదనపు పన్ను భారం మోపే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలపై పన్నుల భారం మోపే నిర్ణయాలను ఏకగ్రీవంగా వ్యతిరేకిద్దాం… ప్రతి కాలనీ ఏకమవుదాం.ప్రజా స్వరాన్ని ప్రభుత్వానికి బలంగా వినిపిద్దాం. ప్రజల గొంతే ప్రజాస్వామ్య బలం అని సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
