తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా చేనేత ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం (ఆగస్టు 7) జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోని డాక్టర్ దేవిదాస్ భవన్‌లో జరిగిన ప్రత్యేక సమావేశానికి తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రాపోలు వీరమోహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఈ సందర్భంగా రాపోలు వీరమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేనేత రంగం ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా మాట్లాడారు. చేనేత సహకార సంఘాల క్యాష్ క్రెడిట్ రుణాలను రద్దు చేసి, తిరిగి రీ-షెడ్యూల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అలాగే టెస్కో (T-SCO)కు ఎన్నికలు నిర్వహించి పాలక మండలిని ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో టెస్కో షోరూమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెట్, డిమాండ్ పెరగడంతో పాటు చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని, నేతన్నలకు మార్కెటింగ్ సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు సహకార సంఘాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని రాపోలు వీరమోహన్ అన్నారు.
30 మంది చేనేత కార్మికులకు సన్మానం
కార్యక్రమం అనంతరం నిజామాబాద్ చేనేత సహకార సంఘానికి చెందిన 30 మంది చేనేత కార్మికులను చేనేత ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల సేవలను కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లా చేనేత ఐక్య వేదిక అధ్యక్షుడు తన్నీరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు బిజ్జు దత్తాద్రి, జిల్లా పద్మశాలి విద్యార్థి వసతి గృహ సంస్థ అధ్యక్షుడు దీకొండ యాదగిరి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బింగి ధర్మవీర్, రాష్ట్ర కమిటీ కార్యదర్శి లోలం జగదీశ్వర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వేముల ఉమారాణి, జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పులగం హనుమాండ్లు, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, నిజామాబాద్ చేనేత సహకార సంఘం అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఆర్మూర్, బోధన్ చేనేత సహకార సంఘాల పాలక మండలి సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
