• విగ్రహాలతో పాటు.. బీసీల సంక్షేమానికీ ప్రాధాన్యం

• బీసీ విద్యార్థుల భవిష్యత్తు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలి: గుజ్జ సత్యం

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్‌: మహనీయుల విగ్రహాల ఏర్పాటుతో పాటు వారి ఆశయాలకు అనుగుణంగా బీసీల సంక్షేమం, విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే, సర్వాయి పాపన్న గౌడ్‌ వంటి మహనీయులు చూపిన సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమానత్వ మార్గంలో ప్రభుత్వం మరింత కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

ఎల్బీనగర్‌లో నిర్వహించిన సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతోత్సవాల కార్యక్రమంలో గుజ్జ సత్యం పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్‌ అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన గొప్ప యోధుడని పేర్కొన్నారు. ఆయన చరిత్రను భావితరాలకు తెలియజేయడంతో పాటు, పాపన్న గౌడ్‌ ఆశయాలను సమాజంలో ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

“మహనీయుల విగ్రహాలు మన చరిత్రను, వారి పోరాట స్ఫూర్తిని భావితరాలకు గుర్తుచేస్తాయి. అదే స్ఫూర్తితో బీసీ విద్యార్థులకు మెరుగైన విద్య, యువతకు ఉపాధి, పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే విధానాలు మరింత బలోపేతం కావాలి” అని గుజ్జ సత్యం అన్నారు.

బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు కీలకమని పేర్కొన్న ఆయన.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ సంక్షేమానికి బడ్జెట్‌లో కేటాయింపులతో పాటు నిధుల సకాలంలో విడుదల, సమర్థ వినియోగంపైనా దృష్టి పెట్టాలని సూచించారు.

“సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళి అంటే ఆయన విగ్రహానికి పూలమాల వేయడంతో పాటు ఆయన ఆశించిన ఆత్మగౌరవం, సమానత్వం బీసీల జీవితాల్లో ప్రతిఫలించేలా చర్యలు తీసుకోవడం. బీసీ యువత విద్య, ఉపాధి, ఆర్థిక ప్రగతిలో ముందుకు సాగినప్పుడే మహనీయుల ఆశయాలకు నిజమైన గౌరవం లభిస్తుంది” అని గుజ్జ సత్యం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ రఘురామ్‌నేత, సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి. గౌడ్‌, బీసీ నాయకుడు జిల్లా నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Avatar photo

By Murthy