తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్ర మంలో భాగంగా ఈ నెల 27న జిల్లాలోని గ్రామాలు, వార్డుల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సి. నారాయణ రెడ్డి తెలిపారు. ప్రజలు ఈ సభలకు తప్పనిసరిగా హాజరై ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా, పారదర్శకంగా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామ, వార్డు సభల వద్ద సంబంధిత బూత్ స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ఓటర్ల జాబితా వివరాలను ప్రజలకు తెలియజేస్తారని పేర్కొన్నారు.
పేరు, వివరాలను పరిశీలించుకోవాలి : ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి సభలకు హాజరై ఓటర్ల జాబితాలో తమ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా తమ పేరు జాబితాలో నమోదైందా, పేరు మరియు ఇంటి పేరు సక్రమంగా ఉన్నాయా, వయస్సు, లింగం, చిరునామా, పోలింగ్ కేంద్రం వివరాలు సరిగ్గా ఉన్నాయా, కుటుంబ సభ్యులందరి పేర్లు నమోదయ్యాయా అనే అంశాలను పరిశీలించుకోవాలన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి :
అర్హత ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో పేరు నమోదు కాకపోయినా, ఇప్పటికే నమోదైన పేరులో తప్పులు ఉన్నా, చిరునామా మారినా లేదా ఇతర వివరాల్లో మార్పులు అవసరమైనా సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించి నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చూడటంతో పాటు అనర్హమైన లేదా తప్పుగా నమోదైన వివరాలను నిబంధనల ప్రకారం సరిచేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి :
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైనదని, దీనిని కేవలం అధికారుల బాధ్యతగా భావించకుండా ప్రతి పౌరుడు బాధ్యతగా పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి సి. నారాయణ రెడ్డి కోరారు. ఈ నెల 27న నిర్వహించే గ్రామ, వార్డు సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయా లేదా పరిశీలించు కోవాలని, ఏవైనా తప్పులు, లోపాలు లేదా అభ్యంతరాలు ఉంటే వెంటనే సంబంధిత బూత్ స్థాయి అధికారులకు తెలియజేసి అవసరమైన సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
