తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 27న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిర్వహించనున్న ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాజేంద్రనగర్ నాయకులు పిలుపునిచ్చారు.రాజేంద్రనగర్ అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆరో వేతన సవరణ సంఘం సిఫారసులు, కరువు భత్యం, అంతర భత్యం, ఇంటి అద్దె భత్యం, ఆరోగ్య బీమా పథకం తదితర అంశాలను అమలు చేయాలని కోరారు..సాధారణ భవిష్య నిధి, తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా, ఉద్యోగుల సమూహ జీవిత బీమా, వైద్య ఖర్చుల బిల్లులను త్వరితగతిన మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ వ్యవసాయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్ యాదవుత, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య రాజేంద్రనగర్ మండల అధ్యక్షుడు బి. యాదగిరి, ఉపాధ్యక్షుడు ఎండీ. సదత్ అలీ, కార్యదర్శులు ప్రభాకర్, శ్రీనివాస్, నవిత, కీర్తి, ఐ. బాబురావు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంఘం కన్వీనర్ నయీమ్, ఎంఐసీ సమన్వయకర్త బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.