• 1700 కిలోమీటర్ల విశ్వకర్మ ఏక్తా యాత్రను విజయవంతం చేద్దాం
• బీసీ కులాల రాజ్యాధికార సాధనకు విశ్వకర్మ ఏక్తా యాత్ర మార్గదర్శకం: గుజ్జ సత్యం
హైదరాబాద్, ఆగస్టు 27: విశ్వకర్మ సమాజ ఐక్యత, రాజకీయ సాధికారత, సామాజిక చైతన్య లక్ష్యాలతో సెప్టెంబర్ 17 నుంచి హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నిర్వహించనున్న 1700 కిలోమీటర్ల ‘విశ్వకర్మ ఏక్తా యాత్ర’ను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. విద్యానగర్‌లో విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విశ్వకర్మ ఏక్తా యాత్ర గోడపత్రిక, పోస్టర్‌ను ఆవిష్కరించారు.
విశ్వకర్మలంతా ఏకతాటిపైకి రావాలి: ఆర్. కృష్ణయ్య
ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విశ్వకర్మలు ఒకే సామాజిక మూలాలు, వృత్తి సంప్రదాయాలు కలిగి ఉన్నప్పటికీ రాష్ట్రాలు, ప్రాంతాలు, భాషల ఆధారంగా వివిధ పేర్లతో పిలవబడుతున్నారని అన్నారు. ఈ విభజన కారణంగా విశ్వకర్మ సమాజం యొక్క వాస్తవ జనాభా బలం, సామాజిక ప్రాధాన్యత, రాజకీయ శక్తి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల దృష్టికి పూర్తిస్థాయిలో చేరడం లేదన్నారు.
“మనమంతా విశ్వకర్మలమే. పేర్లు వేరైనా మన సామాజిక ప్రయోజనాలు ఒక్కటే. విడివిడిగా ఉంటే మన సమస్యలకు పరిష్కారం లభించదు. ఐక్యంగా నిలబడితేనే మన హక్కులను సాధించుకోగలం” అని ఆర్. కృష్ణయ్య అన్నారు.
విశ్వకర్మ సమాజం రాజకీయంగా బలోపేతం కావాలంటే ముందుగా సామాజిక ఐక్యత అవసరమని, అందుకోసం ఇలాంటి చైతన్య యాత్రలు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. 1700 కిలోమీటర్ల ఈ యాత్ర విశ్వకర్మల ఐక్యతను దేశవ్యాప్తంగా చాటిచెప్పే చారిత్రక కార్యక్రమంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఇప్పటికే విశ్వనాథుల పుష్పగిరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సుమారు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించి విశ్వకర్మ సమాజంలో రాజకీయ, సామాజిక చైతన్యానికి బీజం వేశారని ఆర్. కృష్ణయ్య గుర్తుచేశారు. విశ్వకర్మ సమాజ సాంస్కృతిక చైతన్యం, హక్కుల సాధన కోసం పుష్పగిరి చేస్తున్న కృషిని అభినందించారు.
పార్టీలకు అతీతంగా విశ్వకర్మలు ఈ యాత్రకు అండగా నిలవాలని ఆయన కోరారు. గ్రామస్థాయి నుంచి మండల, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నాయకులు సమన్వయంతో పనిచేసి యాత్రను విజయవంతం చేయాలని సూచించారు.
74 రోజుల పాటు సాగే ఈ యాత్రలో యువత భారీగా భాగస్వాములు కావాలని, యువతలో సామాజిక చైతన్యం పెంచడానికి ఈ యాత్రను ఒక గొప్ప వేదికగా ఉపయోగించుకోవాలని ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. విశ్వకర్మ సమాజం తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో సంఘటితంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
బీసీ కులాల రాజ్యాధికారానికి మార్గదర్శకం: గుజ్జ సత్యం
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ విశ్వకర్మ ఏక్తా యాత్ర కేవలం ఒక సమాజానికి సంబంధించిన పాదయాత్ర కాదని, బీసీ కులాల సామాజిక, రాజకీయ సాధికారతకు దిశానిర్దేశం చేసే చైతన్య ఉద్యమమని అన్నారు.
విశ్వకర్మ సమాజం దేశ నిర్మాణంలో శతాబ్దాలుగా కీలక పాత్ర పోషించిందని, తమ వృత్తి నైపుణ్యాలతో సమాజ అభివృద్ధికి విశేష సేవలందించినప్పటికీ తగిన రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అవకాశాలు, సామాజిక గుర్తింపు ఇంకా పూర్తిస్థాయిలో లభించలేదని పేర్కొన్నారు.
“విశ్వకర్మల ఐక్యత బీసీల ఐక్యతకు బలాన్ని ఇస్తుంది. బీసీ కులాలు తమ జనాభా బలానికి అనుగుణంగా రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికారం సాధించాలంటే ప్రతి కులం తన అంతర్గత ఐక్యతతో పాటు సమిష్టి బీసీ ఉద్యమంలో భాగస్వామి కావాలి” అని గుజ్జ సత్యం అన్నారు.
విశ్వనాథుల పుష్పగిరి ఇప్పటికే చేపట్టిన పాదయాత్రలు విశ్వకర్మ సమాజంలో కొత్త చైతన్యాన్ని తీసుకువచ్చాయని, ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు చేపడుతున్న 1700 కిలోమీటర్ల యాత్రను దేశవ్యాప్తంగా విశ్వకర్మల ఐక్యతకు ప్రతీకగా నిలపాలని అన్నారు.
యాత్రకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రతి నాయకుడు బాధ్యత తీసుకోవాలని, విశ్వకర్మ సమాజంలోని యువత, మహిళలు, మేధావులు, ఉద్యోగులు, వృత్తిదారులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని గుజ్జ సత్యం పిలుపునిచ్చారు.
విశ్వకర్మల ఆర్థిక, సామాజిక, రాజకీయ హక్కుల సాధనతో పాటు బీసీ కులాల సమిష్టి రాజ్యాధికార సాధనకు ఈ యాత్ర ఒక మార్గదర్శక ఉద్యమంగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకులు వెంకట్రామయ్య, పుష్పగిరి, అనంతయ్య, రాజేందర్, పృధ్విగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
