• కుల గణనలో ఓబీసీకి ప్రత్యేక స్థానం ఇవ్వాలి
• ప్రశ్న నెం.10ను సవరించాలి: అమిత్ షాకు గుజ్జ సత్యం లేఖ.
• ప్రతి కులానికి ప్రత్యేక కోడ్.. శాస్త్రీయ డ్రాప్‌డౌన్ విధానం అమలు చేయాలి.
హైదరాబాద్, ఆగస్టు 26: 2027 జాతీయ జనగణనలో కుల గణనను శాస్త్రీయంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షాకు ఆయన లేఖ రాశారు.
2027 జనగణనలో కుల గణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని గుజ్జ సత్యం తెలిపారు. అయితే, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా 2026 ఆగస్టు 14న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లోని ప్రశ్న నెం.10 (Scheduled Caste/Scheduled Tribe/Caste)లో OBC (Other Backward Classes) కేటగిరీని స్పష్టంగా పేర్కొనకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

కుల గణనను కేవలం ఓపెన్-ఎండెడ్ విధానంలో నిర్వహిస్తే ఒకే కులం వివిధ పేర్లు, పర్యాయపదాలు, ప్రాంతీయ మాండలికాలు, ఉపకులాల పేర్లతో నమోదు అయ్యే అవకాశం ఉందని, దీనివల్ల తుది డేటాలో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్య, ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయ విధానాలకు ఈ డేటా కీలకం కాబట్టి కులాల నమోదు ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా ఉండాలని కోరారు.
ప్రశ్న నెం.10ను సవరించి ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ కేటగిరీని స్పష్టంగా చేర్చాలని గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఇప్పటికే ఉన్న అధికారిక OBC/BC, SC, ST కులాల జాబితాలను సమగ్రంగా రూపొందించి, ప్రతి కులానికి ప్రత్యేక ప్రామాణిక కోడ్ కేటాయించాలని సూచించారు.
డిజిటల్ జనగణనలో డ్రాప్‌డౌన్ ఆధారిత కుల కోడింగ్ విధానాన్ని తప్పనిసరి చేయాలని, ప్రాంతీయ పేర్లు, పర్యాయపదాలు, ఇంటిపేర్లు, ఉపకులాల విషయంలో స్పష్టమైన శాస్త్రీయ మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన కోరారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎన్యూమరేటర్లకు ముందుగానే సమగ్ర సాంకేతిక శిక్షణ అందించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా, ఓబీసీ/బీసీలతో పాటు ఓసీ, ఎస్సీ, ఎస్టీ తదితర అన్ని సామాజిక వర్గాల వాస్తవ జనాభాను శాస్త్రీయంగా నమోదు చేసే సమగ్ర జాతీయ కులాల జాబితా రూపొందించాలని గుజ్జ సత్యం కోరారు. జనగణనలో సేకరించే డేటా భవిష్యత్తులో విధానాల రూపకల్పనకు ఉపయోగపడేలా ధృవీకరణ, వాలిడేషన్, శాస్త్రీయ వర్గీకరణకు పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
“కుల గణన అనేది కేవలం జనాభా లెక్కల ప్రక్రియ కాదు.. దేశంలోని ప్రతి సామాజిక వర్గం హక్కులు, ప్రాతినిధ్యం, అభివృద్ధి, సామాజిక న్యాయంతో ముడిపడి ఉన్న కీలక అంశం” అని గుజ్జ సత్యం పేర్కొన్నారు. ఒక్కసారి డేటా సేకరణలో లోపాలు జరిగితే వాటి ప్రభావం దశాబ్దాల పాటు కొనసాగుతుందని, అందువల్ల జనగణన ప్రారంభానికి ముందే ప్రశ్నావళి, కులాల జాబితా, కోడింగ్ విధానం, శిక్షణా మార్గదర్శకాలను పునఃపరిశీలించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
2027 జనగణనలో ఓబీసీలకు స్పష్టమైన గుర్తింపు, ప్రతి కులానికి ఖచ్చితమైన జనాభా లెక్కలు, శాస్త్రీయ డిజిటల్ కోడింగ్ విధానం అమలు చేసి సామాజిక న్యాయానికి బలమైన పునాది వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున గుజ్జ సత్యం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
