తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్: కూకట్‌పల్లి : మైనారిటీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ మైనారిటీ మహిళ యోజన పథకంకింద కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన అర్హులైన మహిళలకు రూ.50వేల చొప్పున ఆర్థిక సహాయం అందింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ కూకట్‌పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ ఆర్థిక సహాయంతో మైనారిటీ మహిళలు చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడంతో పాటు మహిళలు స్వతంత్రంగా ఆదాయం పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. బండి రమేష్ ప్రత్యేక చొరవ కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మైనారిటీ మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కల్పించడంలో కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అర్హులైన మహిళలను గుర్తించడం, వారికి పథకం వివరాలను తెలియజేయడం, ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేయడంలో ఆయన కృషి చేశారు. మైనారిటీ మహిళలకు ఆర్థికంగా అండగా నిలవడం ద్వారా వారి కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రూ.50వేల ఆర్థిక సహాయం అందుకోవడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. తమకు ఆర్థికంగా అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు, పథకం ద్వారా ప్రయోజనం అందేలా కృషి చేసిన బండి రమేష్‌ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి వాజిద్ భాష,అస్లాం తదితరులు పాల్గొన్నారు.