తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : భారతీయ ఆధ్యాత్మిక సంప్రదా యంలో శ్రీకృష్ణ జన్మాష్టమికి విశిష్టమైన స్థానం ఉంది. భాద్రపద మాసంలోని కృష్ణపక్ష అష్టమి రోజున శ్రీకృష్ణుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు జన్మాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అధర్మం పెరిగి ధర్మం క్షీణించిన సమయంలో దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని స్థాపించేందుకు శ్రీమహావిష్ణువు శ్రీకృష్ణుడిగా అవత రించాడని భక్తుల విశ్వాసం. మథురలో దేవకీ, వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడిని కంసుడి బారి నుంచి కాపాడేందుకు వసుదేవుడు యమునా నదిని దాటి గోకులానికి తీసుకెళ్లి నందుడు, యశోదల వద్ద పెంచినట్లు పురాణ కథనం. గోకులంలో బాలకృష్ణుడి అల్లరి, వెన్నదొంగతనం, గోపికలతో చేసిన బాల్యలీలలు భక్తులను ఆకట్టుకుంటాయి. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు వంటి రాక్షసులను సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకుల ప్రజలను కాపాడిన ఘట్టం శ్రీకృష్ణుడి దైవత్వానికి ప్రతీకగా నిలిచింది. మహాభారత కాలంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు అందించిన భగవద్గీత బోధనలు మానవాళికి మార్గదర్శకంగా నిలిచాయి. కర్తవ్యాన్ని నిర్వర్తించడం, ధర్మం కోసం నిలబడటం, ఫలితాన్ని ఆశించకుండా బాధ్యతను నిర్వహించడం వంటి విలువలను గీత ద్వారా శ్రీకృష్ణుడు బోధించా డు.జన్మాష్టమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక అలంకరణలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి అర్ధరాత్రి సమయంలో శ్రీకృష్ణ జన్మోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. చిన్నారులను బాలకృష్ణుడు, రాధ వేషధారణలో అలంకరించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలుచోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు, కృష్ణ భక్తి గీతాలతో వేడుకలు వైభవంగా కొనసాగుతాయి. ప్రేమ, భక్తి, ధర్మం, సత్యం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను సమాజానికి చాటిచెప్పిన శ్రీకృష్ణుడి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని భక్తులు పేర్కొంటున్నారు.
