తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :  ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ తత్వవేత్త, విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అత్యంత ముఖ్యమైన స్థానం ఉపాధ్యాయులదే. కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా.. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, బాధ్యత, సేవాభావం, దేశభక్తి వంటి సుగుణాలను పెంపొందించడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. ఒక విద్యార్థి విజయవంతమైన వ్యక్తిగా ఎదగడం వెనుక గురువు మార్గదర్శకత్వం ఎంతో ఉంటుంది.  విద్యార్థి ప్రతిభను గుర్తించి, అతనిలోని నైపుణ్యాలను వెలికితీసి, సరైన మార్గంలో నడిపించేది గురువు. చదువులో వెనుకబడిన విద్యార్థిని ప్రోత్సహించడం నుంచి.. ప్రతిభావంతుడైన విద్యార్థికి మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించడం వరకు ఉపాధ్యాయుల పాత్ర అమూల్యం.
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పటికీ.. విద్యార్థి వ్యక్తిత్వ వికాసంలో ఉపాధ్యాయుడి ప్రత్యక్ష మార్గదర్శకత్వానికి ఉన్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదు.సమాజ అభివృద్ధికి పునాది విద్య. ఆ విద్యను అందించే ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు.. ఇలా వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఎదుగుదల వెనుక ఒక గురువు బోధన, ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఉంటుంది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు తమ గురువులను గౌరవించి, వారి సేవలను స్మరించుకోవాలి. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల్లో మానవీయ విలువలను పెంపొందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి.గురువు నేర్పే అక్షరం.. జీవితానికి ఆధారం.గురువు చూపే మార్గం.. భవిష్యత్తుకు బంగారు బాట.ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.