తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : శ్రీరాంనగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 64వ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల సాంస్కృతిక కమిటీ చైర్మన్ యస్.కె. అల్లావలి మాట్లాడుతూ.. భారతదేశానికి విద్యావేత్తగా, తత్వవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
ఆచార్యునిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రాధాకృష్ణన్ ప్రొఫెసర్‌గా, విశ్వవిద్యాలయ ఉపకులపతిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి విశిష్ట సేవలందించారని తెలిపారు. ఆయన విద్యా రంగానికి చేసిన కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయనకు లభించిన గౌరవాలు, పురస్కారాల్లో భారతరత్న అత్యంత ప్రతిష్టాత్మకమైనదని పేర్కొన్నారు.సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమైన సెప్టెంబర్ 5ను 1962 నుంచి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, నైతిక విలువలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర మంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు లత, ఆశాజ్యోతి, ఇన్‌స్ట్రక్టర్ కవితతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
