తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: చేనేత కార్మికులకు చేయూత పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు, పెన్షన్ ప్రక్రియను సరళతరం చేసి అర్హులైన ప్రతి చేనేత కార్మికుడికి ప్రయోజనం అందించాలని తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ కోరారు.
ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ హయత్‌నగర్‌లోని భువనగిరి పార్లమెంట్ సభ్యుల క్యాంపు కార్యాలయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని రాపోలు వీర మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. చేనేత కార్మికుల సమస్యలను ఎంపీకి వివరించి, చేయూత పెన్షన్ల మంజూరుకు సంబంధించిన అంశాలపై వినతి పత్రం సమర్పించారు.
చేనేత కార్మికుల పెన్షన్ల సమస్యపై స్పందించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసి, చేనేత కార్మికుల పెన్షన్ల విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరినట్లు రాపోలు వీర మోహన్ తెలిపారు.
చేనేత రంగంపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు వృద్ధాప్యంలో పెన్షన్ ఎంతో కీలకమైన ఆర్థిక భరోసాగా ఉంటుందని, అర్హులైన చేనేత కార్మికులకు పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కోశాధికారి జెల్ల రఘు తదితరులు పాల్గొన్నారు.
