తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ కూకట్‌పల్లి :  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేస్తూ కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత కలిగిన కేసీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు అసెంబ్లీకి రావాలని సవాల్ చేసినా స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై మాట్లాడాలి. అసెంబ్లీకి రావడం ఇష్టం లేకపోతే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఫామ్‌హౌస్‌కే పరిమితం కావాలి అని బండి రమేష్ ఘాటుగా అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకనే ప్రజల దృష్టిని మరల్చేందుకు బీఆర్ఎస్ నాయకులు రోడ్లపైకి వచ్చి హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న రాజకీయ డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వారు, ఇప్పుడు ప్రజా సమస్యలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని బండి రమేష్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, గత పాలనలో జరిగిన వైఫల్యాలపై సమాధానం చెప్పకుండా రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలు అనేక సమస్యలతో తమ ప్రతినిధుల వైపు చూస్తున్న వేళ కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చిస్తారా లేక ఫామ్‌హౌస్‌లోనే మొద్దునిద్ర కొనసాగిస్తారా అని బండి రమేష్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా చర్చించేందుకు ప్రతిపక్షం ముందుకు రావాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ఉన్న బాధ్యతను బీఆర్ఎస్ గుర్తించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల నాయకులు, ముఖ్య నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.