• హైదరాబాద్-ఢిల్లీ 1,700 కి.మీ. మహాపాదయాత్ర ప్రారంభం
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, హైదరాబాద్: విశ్వకర్మల ఐక్యత, సాంస్కృతిక పూర్వ వైభవ పరిరక్షణ, సామాజిక సాధికారత, ఆర్థిక స్వావలంబన, రాజకీయ ప్రాతినిధ్యం లక్ష్యంగా చేపట్టిన హైదరాబాద్–ఢిల్లీ 1,700 కి.మీ. మహాపాదయాత్ర గురువారం బోరబండలోని శ్రీ విశ్వకర్మ దేవాలయం వద్ద ప్రారంభమైంది. విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ విశ్వనాథుల పుష్పగిరి నేతృత్వంలో 74 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ దేశ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో కీలకమన్నారు. వారి శ్రమకు తగిన సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సంక్షేమ పథకాలతో పాటు వృత్తిదారులకు మార్కెట్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సరైన ధర, ప్రభుత్వ కొనుగోళ్లలో అవకాశాలు కల్పించాలని సూచించారు. విశ్వకర్మలను కేవలం కార్మికులుగా కాకుండా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని అన్నారు.
కార్యక్రమంలో అతిథి వక్తగా పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం మాట్లాడుతూ సంప్రదాయ వృత్తులను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేయాలని అన్నారు. “టూల్‌కిట్‌తో ఆగకుండా టెక్నాలజీ, బ్రాండింగ్, ఈ-కామర్స్, మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌ను చేరుకోవాలి” అని పిలుపునిచ్చారు. విశ్వకర్మ యువత విద్య, నైపుణ్యం, పారిశ్రామికతపై దృష్టి పెట్టాలని సూచించారు.
“హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సాగుతున్న ఈ యాత్ర కేవలం 1,700 కి.మీ. ప్రయాణం కాదు.. విశ్వకర్మల ఆత్మగౌరవం, ఆర్థిక స్వావలంబన, సామాజిక సాధికారత, రాజకీయ భాగస్వామ్యం కోసం సాగుతున్న చైతన్య యాత్ర” అని గుజ్జ సత్యం పేర్కొన్నారు. విశ్వకర్మల ఐక్యత వర్ధిల్లాలి.. సామాజిక న్యాయం సాధించాలి.. ఆర్థిక స్వావలంబన పెరగాలి.. రాజకీయ ప్రాతినిధ్యం బలోపేతం కావాలి అని నాయకులు పిలుపునిచ్చారు.
