తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : హైదరాబాద్ నుంచి పాదయాత్రగా శంషాబాద్ చేరుకున్న తీన్మార్ మల్లన్నకు స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఓ టీ పాయింట్ వద్ద ఆయన కాసేపు సేదతీరి, అక్కడికి వచ్చిన సామాన్య ప్రజలు, ఆటో డ్రైవర్లు, చిన్న వ్యాపారులతో నేరుగా ముచ్చటించారు.ఈ సందర్భంగా శంషాబాద్ ప్రాంతంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రోడ్ల దుస్థితి, నిత్యం తీవ్రమవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, తీవ్ర తాగునీటి కొరతపై స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. వీటితో పాటు బహదూర్ గూడ భూముల వివాదం, యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి అంశాలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ప్రజలు చెప్పిన ప్రతి సమస్యను ఓపిగ్గా విన్న తీన్మార్ మల్లన్న, వాటన్నింటినీ నోట్ చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నామమాత్రపు పాలనతో ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. తాను ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని, ప్రజా గొంతుకై పోరాడతానని స్పష్టం చేశారు. బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన తన పాదయాత్రను శంషాబాద్ నుంచి ముందుకు కొనసాగించారు.
