• ప్రజల మధ్య ఉంటేనే నిజమైన ప్రజాసేవ: ఎంపీ డాక్టర్ కడియం కావ్య
న్యూస్ డెస్క్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జి డబ్ల్యూ ఎం సి) కౌన్సిల్ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎంపీ పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సాధ్యమైందని, దీనికి అవసరమైన నిధులు కూడా మంజూరయ్యాయని స్పష్టం చేశారు. నగరాభివృద్ధి లో భాగంగా ఎయిర్పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. శానిటేషన్, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత అంశాల్లో జి డబ్ల్యూ ఎం సి ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజలకు మెరుగైన జీవన వాతావరణం కల్పిస్తున్నదని చెప్పారు. “మంచి పరిపాలన, మంచిమాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయి. అధికారం శాశ్వతం కాదు, కానీ మంచి పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది” అని ఎంపీ డాక్టర్ కడియం కావ్య వ్యాఖ్యానించారు. వరంగల్ నగరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పేర్కొంటూ, ప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయ అభివృద్ధికి రూ.14 కోట్ల నిధులు సమకూర్చినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్నామని వెల్లడించారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషితో అమలు దిశగా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కుల నిధుల కోసం కేంద్రాన్ని పదేపదే కోరుతున్నామని తెలిపారు.
కార్పొరేటర్లు ప్రజల సమస్యలను సమగ్రంగా అర్థం చేసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ప్రజాసేవకు అధికారమే మార్గం కాదని, ప్రజల మధ్య ఉంటూ సేవ చేయడమే అసలైన నాయకత్వమని పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్లో సమస్యలను గుర్తించి సమన్వయంతో పరిష్కరించాలని కార్పొరేటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్, జి డబ్ల్యు ఎం సి ఇంచార్జ్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, కార్పొరేటర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
