• రైతులను క్షోభపెడుతున్న కాంగ్రెస్ పార్టీకీ అన్నదాతల ఉసురు తాకుతుంది: ఎంపీ రవిచంద్ర
  • బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నేతలతో కలిసి ‘రైతు సంగ్రామ సదస్సు” లో పాల్గొన్న ఎంపీ రవిచంద్ర

న్యూస్ డెస్క్ : వరంగల్ నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన “రైతు సంగ్రామ సదస్సు”కు రైతులు భారీగా తరలివచ్చారు. మండు టెండను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో హాజరైన రైతన్నలతో సభ ప్రాంగణం కిటకిటలాడింది. అష్టకష్టాల్లో ఉన్న అన్నదాతలకు ధైర్యం నింపడమే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కే.టి. రామారావు మాట్లాడుతూ, రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. “రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పెంపు, పంటలకు బోనస్ వంటి హామీలు అమలు కాలేదు. మాయ మాటలతో రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, రెండున్నర సంవత్సరాలు గడిచినా విద్యుత్, నీటి సమస్యలను పరిష్కరించలేకపోయింది” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిక్లరేషన్ పేరుతో చేసిన వాగ్దానాలను ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు చూపిస్తూ కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, రైతులను క్షోభపెడుతున్న కాంగ్రెస్ పార్టీకి అన్నదాతల శాపం తప్పదని హెచ్చరించారు.

ఈ సదస్సుకు శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ డా. బండా ప్రకాష్ ముదిరాజ్, మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి డా. తాటికొండ రాజయ్య, మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, ఎర్రబెల్లి దయాకర్ రావు, రెడ్యానాయక్, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, శంకర్ నాయక్, సతీష్ కుమార్, నన్నపనేని నరేందర్, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కే.టి. రామారావు వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, అనంతరం సదస్సుకు హాజరయ్యారు.