• నర్సంపేట పట్టణ రజక సంఘం అత్యవసర సమావేశం.. కొల్లూరు లక్ష్మీనారాయణ డిమాండ్

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, నర్సంపేట: బీసీ-ఏ కేటగిరీలోని 57 కులాల ప్రయోజనాలకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని నర్సంపేట పట్టణ రజక సంఘం అధ్యక్షుడు కొల్లూరు లక్ష్మీనారాయణ, కార్యదర్శి తడిగొప్పుల రవి స్పష్టం చేశారు. ముదిరాజులను బీసీ-ఏ కేటగిరీలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

ఈ అంశంపై నర్సంపేట పట్టణ రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కమిటీ సభ్యులు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీ-ఏ కేటగిరీలో ఇప్పటికే ఉన్న 57 కులాల హక్కులు, ప్రయోజనాలకు భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ-ఏ కులాలకు అన్యాయం చేసే నిర్ణయాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచించి, బీసీ-ఏ కులాల ప్రయోజనాలను కాపాడాలని వారు కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ-ఏ కులాల ఉనికి, హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు: రజక సంఘం గౌరవ అధ్యక్షుడు ఐలోని శ్రీనివాస్, కొల్లూరి శ్రీహరి, రాయరాకుల శ్రీనివాస్, ఉప్పుల పరమేష్, కొల్లూరు భాస్కర్, గుడికందుల సదానందం, వాయిల మల్లయ్య, కొల్లూరి రాజు, గడ్డమీద బాలకృష్ణ, వాయిల్లా నరసయ్య, రాజేందర్ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.