• అనాథ వృద్ధుల సేవలో బాలవికాస
తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్, జమ్మికుంట: కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనాథ వృద్ధులకు నిత్యావసర వస్తువులు, దుస్తులు, దుప్పట్లు అందిస్తూ సేవలందిస్తున్న బాలవికాస స్వచ్ఛంద సంస్థ కృషి అభినందనీయమని హుజూరాబాద్ ఏసీపీ మాధవి అన్నారు.
జమ్మికుంటలోని బాలవికాస కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన అనాథ వృద్ధుల సంక్షేమ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పిల్లలు ఉన్నప్పటికీ కొందరు వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు సౌకర్యవంతమైన భవనాల్లో నివసిస్తుండగా, తల్లిదండ్రులను మాత్రం రేకుల షెడ్లలో ఉంచుతున్న ఘటనలు బాధ కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం చట్టాలను రూపొందించిందని, తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని వారిపై ఇకపై కౌన్సెలింగ్‌తో పాటు అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృద్ధులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, సమయానికి ఆహారం తీసుకుంటూ తగిన వ్యాయామం చేయాలని సూచించారు. వచ్చే ఏడాది అనాథ వృద్ధులకు తన తరఫున దుస్తులు, దుప్పట్లు అందజేస్తానని హామీ ఇచ్చారు.
వృద్ధులకు పోలీసుల అండ: జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, గతంలో ఆదిలాబాద్ జిల్లాలో విధులు నిర్వహించిన సమయంలో స్వచ్ఛంద సంస్థలు ఆదివాసీలకు అందించిన సేవలను ప్రత్యక్షంగా చూశానని తెలిపారు. గత ఏడాది బాలవికాస నిర్వహించిన వృద్ధుల సేవా కార్యక్రమం తనకు స్ఫూర్తినిచ్చిందని, అందులో భాగంగానే ఈసారి దుప్పట్లు, టవళ్లు అందజేసినట్లు చెప్పారు. పోలీసు వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని, వృద్ధులకు పోలీసులు ఎల్లప్పుడూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.
15వ వార్డు కౌన్సిలర్ పాతకాల మౌనిక మాట్లాడుతూ, అనాథ వృద్ధులకు తన వంతు సహకారం అందిస్తానని, బాలవికాస నిర్వహించే సేవా కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉంటానని తెలిపారు.
ఏడు రాష్ట్రాల్లో బాలవికాస సేవలు: బాలవికాస ఉమెన్ ప్రోగ్రాం ప్రాజెక్టు కోఆర్డినేటర్ గోపు జ్యోతి మాట్లాడుతూ, తమ సంస్థ ఏడు రాష్ట్రాల్లోని 3,500 గ్రామాల్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, 250 మంది సిబ్బంది సేవలందిస్తున్నారని వివరించారు.
ఈ సందర్భంగా కృష్ణ కాలనీకి చెందిన మైస స్వప్న తన దివంగత భర్త జ్ఞాపకార్థం, ఇల్లందకుంట గ్రామానికి చెందిన మోటపోతుల ఉజ్వల్ తన తండ్రి జ్ఞాపకార్థం ఒక్కొక్కరు రూ.5,000 చొప్పున విరాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవి, బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, కోఆర్డినేటర్లు కే. సుమలత, ఏ. స్వాతి, ఆసియా, 40 మంది అనాథ వృద్ధులు, ఏడుగురు దివ్యాంగులు పాల్గొన్నారు.
