• కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తున్నాం: వొడితల ప్రణవ్
హుజూరాబాద్, జమ్మికుంట: హుజూరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. హుజూరాబాద్ పట్టణం, మండలంతో పాటు కమలాపూర్, వీణవంక, ఇల్లందకుంట మండలాలకు చెందిన లబ్ధిదారులకు మొత్తం రూ.53 లక్షల విలువైన 153 చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తోందని అన్నారు. అనారోగ్యంతో వైద్య ఖర్చులు భరించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయం అందించడం ద్వారా వారి ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
