మాట నిలబెట్టుకున్న ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్
ఆడబిడ్డ పుట్టిన కుటుంబానికి రూ.2,016 ఆర్థిక సాయం.. ‘స్వేచ్ఛ ఆడబిడ్డ’ పథకం ప్రారంభం
ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టి తన ప్రత్యేకతను చాటుకున్నారు జమ్మికుంట మండలం తనుగుల గ్రామ ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించిన **‘స్వేచ్ఛ ఆడబిడ్డ’** పథకాన్ని శుక్రవారం ప్రారంభించి, గ్రామానికి చెందిన ఇద్దరు ఆడబిడ్డల కుటుంబాలకు రూ.2,016 చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. అంబాల రజనీకాంత్ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆడపిల్లల జన్మను గౌరవించడం, వారి పట్ల సమాజంలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడం లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ‘స్వేచ్ఛ ఆడబిడ్డ’ పథకం వాల్ పోస్టర్ను సర్పంచ్ జక్కె కిరణ్, ఉప సర్పంచ్ దంపతులు, గ్రామస్తులు కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ మాట్లాడుతూ, ఆడపిల్ల అంటే భారం కాదని, కుటుంబానికి వరం.. సమాజానికి గర్వకారణమని అన్నారు. ప్రతి ఆడబిడ్డకు గౌరవం, ప్రేమ, సమాన అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఆడబిడ్డ పుట్టుకను గౌరవించే ఈ ఆలోచన మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
**గ్రామ పంచాయతీకి బోర్డు బహూకరణ**
ఈ కార్యక్రమంలో భాగంగా ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్ దంపతులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి నేమ్బోర్డును బహూకరించారు. ఆడబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పథకాన్ని ప్రారంభించడంపై సర్పంచ్ జక్కె కిరణ్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కె కిరణ్, ఉప సర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్, వార్డు సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
