తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ : మారుతున్న కాలాగుణంగా పద్మశాలీయులు తాము ఎంచుకున్న రంగాలలో స్వయం వృద్ధి సాధించే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ జాయింట్ డైరెక్టర్, అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శి ఎ. రంగనాథ్ పిలుపునిచ్చారు. కుల వృత్తితోపాటు ఉద్యోగ ధర్మాలను పాటిస్తూ, దేశ ఆర్థిక పురోగతిలో పద్మశాలీయులు తమ వంతు కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. ఇదివరకు అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ కార్యదర్శిగా నియమితులైన ఎ. రంగనాథ్ అధికారిక పర్యటనలో భాగంగా ఆదివారం శివరాంపల్లిలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి విచ్చేశారు. ఈ సమాచారం అందుకున్న తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏర్వ సత్యనారాయణ, రంగారెడ్డి జిల్లా సంఘం మీడియా సెల్ అధ్యక్షుడు పగిడిమర్రి సూర్యనారాయణ తదితర స్థానిక పద్మశాలి సంఘాల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎ. రంగనాథ్ మాట్లాడుతూ.. దేశానికి రైతు ఏ విధంగా వెన్నెముకో, ఆ తర్వాతి స్థానం చేనేత పద్మశాలీలదేనని గుర్తు చేశారు. ప్రపంచీకరణ మరియు వస్త్ర తయారీ యాంత్రీకరణ కారణంగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా చేనేత వృత్తికి ఆదరణ తగ్గి, ఆ కుటుంబాలు చితికిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో విద్యావంతులైన పద్మశాలీయులు వృత్తిపరంగా రాణించేందుకు అనుకూల మార్గాలను, నూతన ఉత్పత్తి ఒరవడులను అలవర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వివిధ దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్త్రాల స్థానంలో మన దేశీయ ఉత్పత్తులను మెరుగ్గా తయారు చేసి మార్కెట్లో నిలదొక్కుకునేలా నైపుణ్యాలను సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు కోట శ్యామ్ కుమార్, శిరందాసు నరేందర్, కోట పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
