తెలంగాణ ఎక్స్ ప్రెస్ న్యూస్ :సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ఉమ్రా యాత్రికులను తక్షణమే స్వదేశానికి రప్పించి, వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని కేఎన్‌ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షుడు మెకానిక్ బాబా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజహరుద్దీన్, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పందించి బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మెకానిక్ బాబా మాట్లాడుతూ, విమానాల సాంకేతిక సమస్యలు, వాతావరణ పరిస్థితుల కారణంగా సుమారు 4 వేల మంది భారతీయ ఉమ్రా యాత్రికులు జెడ్డా, మదీనా విమానాశ్రయాల పరిసరాల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీరిలో హైదరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, కల్వకుర్తి ప్రాంతాలకు చెందిన తెలంగాణ యాత్రికులు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

విమానాల రద్దు, ఆలస్యంతో యాత్రికులు హోటళ్లలోనే ఉండిపోవాల్సి వస్తోందని, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్‌ బస గడువు ముగియడం, వీసా గడువు దగ్గరపడుతుండటంతో ముఖ్యంగా వృద్ధులు, మహిళలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. స్వదేశంలో ఉన్న వారి కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని చెప్పారు.

ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి : ఈ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అజహరుద్దీన్ వెంటనే స్పందించాలని మెకానిక్ బాబా కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి బాధితులకు సహాయం అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సౌదీలోని భారత రాయబార కార్యాలయం ద్వారా యాత్రికులకు తక్షణ సహాయం అందించాలని, కేంద్ర విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుని అవసరమైతే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కోరారు. వీసా గడువు ముగియకుండా పొడిగించేలా చర్యలు తీసుకోవడంతోపాటు, తెలంగాణ భవన్‌, హజ్‌ హౌస్‌లో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధిత కుటుంబాలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని సూచించారు. పవిత్ర ఉమ్రా యాత్రకు వెళ్లి విదేశంలో ఇబ్బందులు పడుతున్న యాత్రికులను ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు తక్షణ చర్యలు చేపడుతుందని ఆశిస్తున్నట్లు మెకానిక్ బాబా తెలిపారు.

You missed